సిద్దిపేట రంగనాయకసాగర్ జలాశయంలోకి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గోదావరి జలాలు విడుదల చేశారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు రావాలనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికి మార్గనిర్దేశం చేసిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు తెలిపారు.
"ప్రాజెక్టుల నిర్మాణాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. ఒక్క ఇల్లు కూడా మునగకుండా రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణం జరిగింది. 170 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు నీళ్లు వచ్చేలా నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు కింద 400 చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపే అవకాశం దొరికింది. 1.5 టీఎంసీలు రాగానే కుడి, ఎడమ కాలువలకు నీళ్లు ఇస్తాం. కాలువపై వ్యవసాయం చేసే అదృష్టం సిద్దిపేట జిల్లా రైతులకు వచ్చింది. ఈ జలాలు రైతుల బతుకుదెరువు, జీవన స్వరూపాన్ని మారుస్తాయి."