నేడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జరగనుంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహం జరుగుతుంది. వధువుల తరుపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు మల్లన్న కల్యాణంతో అంకురార్పణ జరగనుంది.
తెల్లవారుజాము నుంచే..
తెల్లవారుజాము నుంచే కల్యాణోత్సవ క్రతువు ప్రారంభం కానుంది. ఉదయం ఐదు గంటలకు దృష్ఠికుంభం, బలిహరణం నిర్వహిస్తారు. గర్భాలయం నుంచి ఊరేగింపుగా స్వామి, అమ్మవార్ల మూర్తులను కల్యాణ వేదిక మీదకు తీసుకువస్తారు. 10.45నిమిషాలకు కల్యాణం నిర్వహించునున్నారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు.