పుట్టిన ఊరు... సొంత ఇంటినీ.... నమ్ముకున్న భూమిని వదిలి వెళ్లడానికి వారికి మనసు రాలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోయి వేరే ప్రాంతానికి వలస వెళ్లడానికి వారికి కాలు కదలడం లేదు. ఇది మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆవేదన. గూడు కోల్పోయిన వారి గోడు వర్ణణాతీతంగా ఉంది. తమ ఊరును విడిచి పునరావాస కాలనీకి వెళ్లే సమయంలో వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
తడి నయనాలతో... ఊరు ఖాళీ అయింది - ఊరు ఖాళీ చేసిన పల్లెపహాడ్ గ్రామ ప్రజలు
ఆ ఊళ్లో ఏ ఇంట చూసినా ఉద్వేగం.. ఏ గుండె తడిమినా ప్రకంపం.. ఏ కంట చూసిన తడిదనం.. ఏ జ్ఞాపకం కదిపినా పెనవేసుకున్న అనుబంధం. మరువలేక... విడువలేక.. వదలలేక సాగే పయనం. ఇన్నేళ్లు ఒకే గూటి పక్షుల్లా జీవించిన ఆ ఊరి జనం.. చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదురైనట్టు పయనమయ్యారు. కోవెల లాంటి ఇళ్లు.. ఆత్మీయులు లాంటి ఊరోళ్లు... అన్నపూర్ణలాంటి పంట భూములను విడిచి బరువెక్కిన హృదయాలతో... పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకుంటూ పునరావాస కాలనీకి తరలినారు.. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఒకటైన పల్లెపహాడ్ తండా వాసులు.
చిన్నా, పెద్దా.. ముసలి, యువత అనే తేడా లేదు. అందరి హృదయాలు బరువెక్కాయి. వెళ్లాలని తెలిసినా.. పెనవేసుకున్న జ్ఞాపకాలను తెంచుకోలేక... ఒకరినొకరు పట్టుకొని తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బోరున విలపించారు. సిద్దిపేట జిల్లా పల్లెపహడ్ తండాకు చెందిన కొందరు ముందుగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. అందరూ కలిసి ఒకేసారి వెళ్లాలని.. తండా వాసులు నిర్ణయించుకున్నారు. అడ్డొస్తున్న కన్నీటి పొరను చీల్చుకుంటూ సాగిన చూపులు దూరమైపుతున్న తమ ఊరిని చూసుకుంటూ ఏడ్చుకుంటూనే వెళ్లారు.
ఇదీ చూడండి:నిబంధనలు గాలికొదిలేశారు... వైరస్ను ఆపలేకపోతున్నారు