మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఒకటైన ఏటిగడ్డ కిష్టాపూర్ వాసి జి.తిరుపతికి గజ్వేల్ పట్టణం సంగాపూర్‌లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో కేటాయించిన ఇల్లు ఇది. గృహప్రవేశం చేసిన నాలుగు నెలలకే కూలే దశకు చేరింది. భయంతో ఇల్లు ఖాళీచేసిన బాధితుడు తమ్ముడింట తలదాచుకుంటూ సొంతింటికి మరమ్మతు చేసుకుంటున్నారు. కూలిపోయిన ఇంటిగోడను తిరిగి నిర్మించుకున్నారు. ఈ కాలనీలో సగానికిపైగా ఇళ్లు చిన్న వానకే కురుస్తున్నాయి. మరుగుదొడ్లు కుంగిపోయాయి. ఇంటింటికీ ఇలా ఏదో ఒక సమస్య ఉందని బాధితులు వాపోతున్నారు.
తరతరాల వారసత్వంగా వస్తున్న ఆవాస ప్రాంతాల్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు అప్పగిస్తున్న బాధితులకు.. చెప్పిన మేరకు న్యాయం చేకూరడం లేదు. ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటు కాకపోవడం, నిర్మించిన ఇళ్లూ నాణ్యంగా లేకపోవటంతో తరలివచ్చిన బాధితులు కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మల్లన్నసాగర్, బీమా ఎత్తిపోతల్లోని శంకరపల్లి.. నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని చిన్నోనిపల్లి, సంగబండ జలాశయం కింద రెండు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల్లో జలాశయాల కిందా ఇలాంటి పరిస్థితే ఉంది.
త్యాగధనుల అవస్థలు
పుట్టిపెరిగిన నేల, దానితో ముడిపడిన అనుబంధాలు, ఇళ్లు, పశుసంపదకు అనువైన వాతావరణం.. అలాంటి గ్రామం ఖాళీ చేయడానికి మనసు ఒప్పకున్నా పునరావాసానికి తరలివస్తున్నారు బాధితులు. నివాస యోగ్యమైన నిర్మాణాలు, వసతులు కల్పించాలనేది వారి కోరిక.. కానీ, పునరావాస కల్పనపై అధికారులు చెబుతున్న దానికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. ప్రజలు గ్రామాలు ఖాళీచేస్తే చాలన్నట్లు అధికారులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలను అమలుచేస్తున్నారు. కాలనీల్లో కనీస వసతులు కల్పించడం లేదు. కొత్త ఇళ్లలో చేరాక బాధితులే ఒక్కోటీ చక్కబెట్టుకోవాల్సిన దైన్యస్థితి.. కొన్ని ప్రాజెక్టుల కింద పునరావాసం అపహాస్యమవుతోంది. ఎప్పుడు ప్యాకేజీ ఇస్తారో, ఇళ్ల నిర్మాణం చేపట్టేది ఎన్నడో చెప్పేవారూ లేరు.