తెలంగాణ

telangana

ETV Bharat / state

అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..

దుబ్బాక స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తెరాస ఉండగా... గెలిచి తమ సత్తా చూపించాలని భాజపా, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించడంలో ఏ నాయకుని సత్తా ఏంతో అంతర్గతంగా అంచనాలు వేసుకుంటున్నాయి.

Major political parties announcing candidates soon for dubbaka by poll
అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..

By

Published : Oct 3, 2020, 4:12 AM IST

Updated : Oct 3, 2020, 4:32 AM IST

అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు..

దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన దుబ్బాక స్థానంలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు సన్నద్ధమయ్యాయి. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న తెరాస.. మొదట రామలింగా రెడ్డి కుటుంబానికే మొగ్గు చూపింది. ఈ మేరకు రామలింగారెడ్డి భార్య సుజాతకు టిక్కెట్ ఇవ్వనున్నట్లు శ్రేణులకు సంకేతాలు వచ్చాయి. కాని రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీలో అసమ్మతి లేచింది. సమావేశాలు నిర్వహించి తీర్మానాలు కూడా చేశారు. దీంతోపాటు ఇటీవల రామలింగారెడ్డి కొడుకు సతీష్ రెడ్డికి చెందిన వ్యక్తిగత వీడియోలు సంచలనం సృష్టించాయి.

పలువురి పేర్ల పరిశీలన

అసమ్మతి, వీడియోల కలకలం తర్వాత పార్టీ పునరాలోచనలో పడట్లు సమాచారం. దీంతో కొత్తపేర్లు తెరమీదకు వచ్చాయి. స్థానికంగా మంచి ఆదరణ ఉన్న మాజీ మంత్రి దివంగత ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల్లో తమ కుటుంబంపై ఉన్న ఆదరణను గుర్తించాలని.. తనకు అవకాశం ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రామి రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. టికెట్ ఎవరికి వచ్చినా.. గెలుపే లక్ష్యంగా ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

బలమైన అభ్యర్థి కోసం

కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నా సరైన నాయకుడు లేక గత ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైంది. ఈ విషయాన్ని గుర్తించిన అధిష్ఠానం.. బలమైన నాయకుని కోసం వెతుకులాట మొదలుపెట్టింది. విజయశాంతికి పోటీ చేయమని సూచించగా... ఆమె ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం తెరాసలో ఉన్న ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తాం పార్టీలోకి రావాలని.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదని సమాచారం. దీంతో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ భార్య పద్మిని రెడ్డి, స్థానిక నాయకుడు వెంకట నర్సింహా రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థి ప్రకటన విషయంలో జాప్యం జరగకుండా కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతోంది. దుబ్బాక కాంగ్రెస్ నేతలతో నేడు సమావేశమై అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి. తెరాసకు ధీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ధీమాతో రఘునందన్​ రావు

దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకోని తెలంగాణలో తామే ప్రత్యమ్నాయం అన్న సంకేతాలు ఇవ్వాలన్న లక్ష్యంతో భాజపా ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. 2019పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావుకే మరోసారి టికెట్ వస్తుందన్న అంచనాలతో పార్టీ శ్రేణులు ఉన్నారు. అయితే ముత్యంరెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్లుగా మార్చుకునేందుకు.. ఆయన కొడుకు శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోని.. టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. రఘునందన్ రావు మాత్రం టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం పోటీకి దిగుతున్నారు. కత్తి కార్తీక ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది.

ఇదీ చదవండి:సాయం చేసే గుణమే ఇప్పుడతన్ని ఆదుకుంటోంది

Last Updated : Oct 3, 2020, 4:32 AM IST

ABOUT THE AUTHOR

...view details