కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబా ఫూలే అని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని ఆయన భావించారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆ దిశగా..
అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని మంత్రి అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి.. భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే ఫూలేకు నిజమైన నివాళులని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతి