సిద్దిపేట డిపోలో మొత్తం 115 బస్సులు ఉన్నాయి. 54 ఆర్టీసీ, 61 అద్దె బస్సులున్నాయి. 380 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఈ డిపోలో రూ.5.28 కోట్లు ఆదాయం కోల్పోయింది.
బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా వాటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. మూడు రోజులకోసారి మెకానిక్‌లు బస్సు సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. బ్యాటరీల నిర్వహణ, టైర్లలో గాలిని తనిఖీ చేస్తున్నారు. రోజువారీగా షిఫ్టుల పద్ధతిలో ఐదుగురు సిబ్బంది వస్తున్నారు. పది మంది డ్రైవర్లను అత్యవసరానికి సిద్ధంగా ఉంచుతున్నారు. వలస కార్మికుల తరలింపుపై ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తేనున్నామని డిపో మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.