మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీలో సముద్ర మట్టానికి 88మీటర్ల ఎత్తున ఉన్న గోదావరి జలాలను వివిధ దశల్లో ఎత్తిపోతల ద్వారా 618 మీటర్ల ఎత్తులో గల కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చుతున్నారు. అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారానే ఇతర ప్రాంతాలకు గోదావారి జలాలు చేరుతాయి. 15 టీఎంసీల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌కు కొండపోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండపోచమ్మ దేవాలయం, దానికి సమీపంలోని కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. ఈ పుణ్యక్షేత్రాల పేరుమీదనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండపోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు.
ఈ ప్రాజెక్టును ఓ దేవాలయంగా భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. కొండ పోచమ్మ దేవాలయంలో శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో చండీయాగం, పంపుహౌజ్ వద్ద శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన యాగం చేయనున్నారు. ఉదయం 4 గంటలకే యాగాలు ప్రారంభం కానున్నాయి.