కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు మొదలయ్యాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడం వల్ల ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ నీటివిడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాసం, పరిహారం ప్యాకేజీ అమలు చేయకుండా బలవంతంగా ఖాళీ చేయించడంపై మామిడ్యాల, బహిలాంపూర్ గ్రామస్థులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇళ్లను ఖాళీ చేయడానికి మే1 వరకు హైకోర్టు గడువు ఇచ్చినా.. ఏప్రిల్ 30న రాత్రి 600 మందికి పైగా పోలీసులు గ్రామాలను చుట్టుముట్టి బలవంతంగా ప్రజలను ఖాళీ చేయించారని చెప్పారు. ఫోన్లు పనిచేయకుండా చేశారని తెలిపారు.
కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం
బలవంతంగా ఖాళీ చేయించడంపై కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని బ్రిటీష్‌రాణి నియమించలేదని.. ఇది బ్రిటీష్ రాజ్యంకాదని వ్యాఖ్యానించింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికింది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల్ని బాగా చూసుకోవాలని.. గత పాలకుల్లాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. చిన్న పిల్లల ముందు.. తల్లిదండ్రులు, బంధువులను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించి వాటిని కూల్చివేస్తే రాజ్యంపై వారికి వ్యతిరేకత ఏర్పడుతుందని, వాళ్లు నక్సల్స్‌గా మారితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది.
ఈనెల 6లోగా నివేదిక
ఈ విషయంపై బాధితుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేసి.. ఈనెల 6లోగా నివేదిక పంపాలని సిద్దిపేట నాలుగో అదనపు జిల్లా జడ్జిని ఆదేశించింది. 110 ఎకరాల్లోని పంటను కోసి ధాన్యాన్ని రైతులకు అప్పగించాలని.. వారికి నిల్వ చేసేఅవకాశం లేకపోతే ప్రభుత్వమే నిల్వ చేసి అప్పగించాలని సూచించింది. కోతదశకు రాని పంటకు నష్టం అంచనా వేసి పరిహారాన్ని రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.