తెలంగాణ

telangana

ETV Bharat / state

కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం.. - మెదక్ తాజా వార్తలు

Komuravelli Mallikarjuna Swamy Kalyanam: కొమురవెల్లి మల్లన్న కల్యాణం కన్నుల పండువగా సాగింది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మల వివాహ వేడుకను పండితులు నిర్వహించారు. ప్రభుత్వం తరుపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వామివార్లకు పట్టువస్త్రాలు, బంగారు కిరీటం సమర్పించారు.

Komuravelli Mallikarjuna Swamy
Komuravelli Mallikarjuna Swamy

By

Published : Dec 19, 2022, 11:35 AM IST

Komuravelli Mallikarjuna Swamy Kalyanam: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న స్వామి మనువాడారు. కల్యాణ మహోత్సవానికి .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్​రావు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లికార్జునుడికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు. బలిహరణంతో రుత్వికులు క్రతువును ప్రారంభించిన అనంతరం భక్తులకు స్వామి వారి మొదటి దర్శనం కల్పించారు. వేలాది మంది భక్తుల మధ్య మల్లన్న స్వామి వివాహం జరిగింది. ఈ వేడుకల్లో మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మల్లారెడ్డితో పాటు పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం: ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొమురవెల్లికి రూ.30 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆలయ దర్వాజాలకు వెండి తాపడాలు చేయించగా, ఈ సారి స్వామివారికి స్వర్ణకిరీటం అలంకరింపజేయడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది కల్యాణోత్సవం లోపు ఇద్దరు అమ్మవార్లకు కిలో బంగారంతో కిరీటాలు తయారు చేయిస్తామన్నారు. రూ.11కోట్లతో క్యూకాంప్లెక్స్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.14 కోట్లతో చేపట్టిన 50 గదుల ధర్మశాల పనులు సాగుతున్నాయని తెలిపారు. స్వామివారి పేరున ‘మల్లన్నసాగర్‌’ నిర్మిస్తే.. ఎంతో మంది అడ్డుకోవాలని ప్రయత్నించారని, అయితే ‘మల్లన్న’ శక్తి ముందు వారి ఆటలు సాగలేదన్నారు.

చివరి దశలో గందరగోళం:అంగరంగ వైభవంగా జరిగిన కల్యాణోత్సవం చివరి దశలో గందరగోళంగా మారింది. స్వామివారి పెళ్లి తంతు ముగియగానే మంత్రి హరీశ్‌రావు వేదికపై నుంచే మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా ఆలయంలోని మల్లికార్జునస్వామి మూలవిరాట్‌ దర్శనానికి వెళ్లారు. దీంతో తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక వద్ద ఉన్న పోలీసులు ఆయన వెంటే వెళ్లారు. దీంతో భక్తులు ఒక్కసారిగా వేదిక వద్దకు వెళ్లి ముత్యాలు, తలంబ్రాల కోసం పోటీ పడ్డారు.

‘మల్లన్న’కు స్వర్ణ కిరీటం:ఎట్టకేలకు కొమురవెల్లి మల్లికార్జునస్వామికి స్వర్ణకిరీటం తయారైంది. సుమారు రూ.కోటి విలువైన 1.57 కిలోల బంగారంతో తిరుపతిలో తయారు చేయించారు. శనివారం రాత్రి కొమురవెల్లికి తీసుకొచ్చామని ఆలయ ఈవో బాలాజీ, పాలక మండలి ఛైర్మన్‌ భిక్షపతి తెలిపారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం మంత్రి హరీశ్‌రావు ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌కి అప్పగించారు. అర్చకులు ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్‌ విగ్రహానికి కిరీటాన్ని అలంకరింపజేశారు.

వైభవంగా శకటోత్సవం:శకటోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. టేకు రథంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు చేపట్టారు. మల్లన్న కొలువైన గుట్ట చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్లు సాగింది. భక్తులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

నేతల కన్యాదాన కట్నం:ఉత్సవానికి హాజరైన నేతలు కన్యాదాన కట్నం ప్రకటించారు. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి ఒక్కొక్కరు రూ.1,10,116 చొప్పున ఇచ్చారు. వారితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ.50,116, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి రూ.25 వేలు, ఎర్రోల్ల శ్రీనివాస్‌ రూ.25 వేలు, తలసాని శంకర్‌యాదవ్‌ రూ.50 వేలు ప్రకటించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పసుపు, కుంకుమ కింద రూ.1,116 ప్రకటించారు.

ఇవీ చదవండి:Cycling track in Hyderabad : ఈ వేసవిలో అందుబాటులోకి సైక్లింగ్ ట్రాక్

చైనాతో సరిహద్దులో వివాదం.. వాణిజ్యంలో మాత్రం జోష్.. దిగుమతులు నిషేధించలేమా?

ABOUT THE AUTHOR

...view details