Komuravelli Mallikarjuna Swamy Kalyanam : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. బృహన్మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను నిర్వహించారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు మనువాడాడు. కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు. ఈ కల్యాణ వేడుకను మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు భక్తి పారవశ్యంతో తిలకించారు.
ఈ సందర్భంగా కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని.. రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నేడు కల్యాణం వైభవంగా జరగడం.. స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మల్లన్న స్వామి కల్యాణం వైభవంగా జరిగిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ.30 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జరిగే స్వామి కల్యాణంలోపు కేతమ్మ, మేడమ్మ అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి వెల్లడించారు. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.