మార్గశిర మాసం చివరి ఆదివారం.. ప్రతి ఏటా కొమరవెల్లి మల్లన్న స్వామికి కల్యాణం జరిపించడం ఆనవాయితీ. దిష్టికుంభం. బలిహరణంతో రుత్వికులు క్రతువును ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వామివారి తొలిదర్శనం కల్పించారు. గర్భాలయం నుంచి మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ మూర్తులను... ఉరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. వేలాదిమంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య కోరమీసాల మల్లన్న వివాహం జరిగింది. వధువుల తరుపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.
మంత్రుల చదివింపులు..
కల్యాణంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్లొన్నారు. మంత్రి హరీశ్ రావు.. మల్లికార్జున స్వామికి కన్యాదానం కింద... రూ.లక్షా వెయ్యి పదహారు సమర్పించగా.. మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి తరుపున మేడలమ్మ, కేతలమ్మలకు... రూ.లక్షా వెయ్యి పదహారు సమర్పించారు. కల్యాణ అనంతరం మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి గర్భగుడిలోని ములవిరాట్‌లను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.