Komaravelli Mallikarjuna Swami Brahmotsavalu: భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం, కొండసారికాల్లో వెలసిన కోరమీసాల మల్లన్న క్షేత్రం భక్తిపారవశ్యంతో మునిగిపోయింది. శివసత్తుల శంఖారావ ధ్వనులు, పోతురాజుల ఆటపాటలతో సిద్ధిపేట జిల్లాలో వెలిసిన శ్రీ కొమరవెల్లి మల్లికార్ఖున స్వామి దేవాలయం పసుపువర్ణంగా మారిపోయింది. తెలంగాణ అంటేనే జానపద నృత్యాలకు, ఒగ్గు కళలకు, సంప్రదాయలకు పుట్టినిల్లు. అలాంటి సంస్కృతి మొత్తం మల్లన్న దేవాలయం వద్ద కనిపిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో మల్లన్న స్మరణతో భక్తులతో నిండిన దృశ్యాలు చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు.
స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రధాన ఘట్టమైన అగ్ని గుండాల కార్యక్రమం పోలీసుల బందోబస్తు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే ఈ ఉత్సవాలు హైదరాబాద్కు చెందిన యాదవులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వీరశైవ అర్చకులు మల్లన్న, మెడలమ్మ, కేతమ్మల ఉత్సవ విగ్రహాలతో తోటబావి వద్ద నిర్వహించే అగ్ని గుండాలను తొక్కడం ప్రారంభించారు. అనంతరం భక్తులు, శివసత్తులు, పోతురాజులు అగ్నిగుండాలను దాటుతూ మల్లన్నను స్మరించారు.
అగ్ని గుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఆలయ తోటబావి వద్ద సమీదలను (కట్టెలను) కుప్పగా పేర్చి మల్లన్నను స్మరిస్తూ 21 వరుసలతో చిన్న పట్నాన్ని రచిస్తారు. పట్నంలో బలిజ మేడలమ్మ, గోళ్ల కేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలతో ఆలయ పరిసరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబిస్తోంది.