ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ సిద్దిపేటలో పర్యటించనున్నారు. దాదాపు రూ.1,200 కోట్లతో చేపట్టిన వివిధ పథకాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరనున్న సీఎం కేసీఆర్... రోడ్డు మార్గంలో కొండపాక మండలం దుద్దెడకు చేరుకుంటారు. అక్కడ నిర్మించనున్న ఐటీ టవర్స్‌కు భూమిపూజ చేయనున్నారు. అనంతరం మూడు ఐటీ కంపెనీల ప్రతినిధులతో అధికారులు.. సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రంలోనే తొలిసారి నిర్మించిన తెరాస జిల్లా కార్యాలయాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 127 రైతు వేదికల నిర్మాణం చేపట్టగా.. దాదాపుగా అన్ని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మిట్టపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. స్థానిక రైతులతో కొంత సమయం గడపనున్నారు.
వెయ్యి పడకల ఆసుపత్రి
అక్కడి నుంచి సిద్దిపేట శివారులో 51,772 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత కొమటిచెరువుకు చేరుకుని.. నూతనంగా నిర్మించిన నెక్లెస్ రోడ్డుతోపాటు చెరువు సుందరీకరణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. దేశంలోనే మరెక్కడ లేని విధంగా... రూ.163 కోట్లు వెచ్చించి.. 34 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన.. 2,460 రెండు పడకగదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాక ముఖ్యమంత్రి వారితో ముచ్చటిస్తారు. ఇళ్ల సముదాయంలో పర్యటించి సదుపాయాలను పరిశీలిస్తారు. ఆ కాలనీకి కేసీఆర్ నగర్‌గా ఇప్పటికే నామకరణం చేశారు.