Harish Rao on Monsoon Crops in Telangana : దేశానికే ఆదర్శంగా తెలంగాణ మారిందని.. సీఎం కేసీఆర్ రైతుకు విలువ పెంచారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంక్షేమంలోనైనా.. అభివృద్ధిలోనైనా సిద్ధిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం భాషాయిగూడెం-తిమ్మాయిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
వానాకాల పంటను నెల ముందుకు జరపండి..: అకాల వర్షాలు, వడగళ్ల వానలతో చేతికొచ్చే పంట నష్టపోతుందని, వానాకాలం పంట నెల ముందుకు జరపాలని రైతులకు హితవు పలికారు. గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండేవని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ లేకపోతే.. తెలంగాణ రాకపోతే.. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, ఆసరా ఫించన్లు ఉండేవి కాదన్నారు. అలాగే రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు.