Kaleshwaram Project : ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మంజీర నది తర్వాత కూడవెళ్లి, హల్దీ వాగులు ప్రధానమైన జలవనరులు. కూడవెళ్లి, హల్దీ వాగుల్లో వర్షాలు పడితేనే నీరు ఉండేది. డిసెంబర్ నాటికి ఈ వాగులు ఎండిపోయేవి. వీటి పరివాహాక ప్రాంతాల్లోని రైతులు వర్షకాలంలోనే పంటలు సాగు చేసేవారు. డిసెంబర్ సమీపిస్తుండగానే వాగులు ఎండిపోయేవి. దీంతో భూగర్భ జలాలు సైతం అడుగంటేవి. చేసేది లేక రైతులు కేవలం ఒక పంటను మాత్రం పండించుకునే వారు. చివరి దశలో నీరు సరిపోక.. కొంత పంట ఎండిపోయిన సందర్భాలు అనేకం.
కాళేశ్వరంతో అనుసంధానం..కూడవెళ్లి, హల్దీ వాగులను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో అనుసంధానించారు. ఇక ఈ ప్రాంత రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ప్రారంభమయ్యో కూడవెళ్లి వాగు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా ప్రవహించి అప్పర్ మానేరులో కలుస్తుంది. సిద్దిపేట జిల్లాలో ఈ వాగుపై సుమారు 20వేల ఎకరాల సాగు ఆధారపడి ఉంది. గతంలో వర్షాలు సమృద్ధిగా పడిన సమయంలో యాసంగి పంటలు వేసి చివరి దశలో నీళ్లు లేక వేల ఎకరాల్లో పంట ఎండిపోయిన దాఖలాలున్నాయి.
Kaleshwaram Project Water to Medak District : 2021లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా మల్లన్నసాగర్- కొండపోచమ్మ సాగర్‌ల మధ్య ఉన్న కాలువకు గండిపెట్టి కూడవెళ్లి వాగులోకి ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. వేల ఎకరాల పంట చేతికి వచ్చింది. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని కూడవెళ్లి వాగులోకి వదులుతున్నారు. దీనివల్ల ఈ వాగుపై ఉన్న 35కుపైగా చెక్ డ్యాంలు మండువేసవిలోనూ మత్తడి దూకుతున్నాయి. సంవత్సరం పొడవునా వాగులో నీళ్లు ఉండటంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. దాదాపు 20వేలకు పైగా ఎకరాల్లో రైతులు నిరాటంకంగా రెండు పంటలు పండించుకుంటున్నారు.