సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండల పరిధిలోని 29 గ్రామ పంచాయితీల రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించి జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అందించారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ.. ఏ సమయంలో ఏ పంట పండిస్తే ఎలాంటి లాభాలు వస్తాయో ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. వ్యవసాయంలో సమూల మార్పులు తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు అందించడం కోసం జిల్లాలో రిజర్వాయర్లు నిర్మించి కాల్వల ద్వారా పంట పొలాలకు నీరందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి సఫలమైందని అన్నారు. కలెక్టర్లు, రైతుబంధు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, మండల అధికారులు అందరూ కలిసి.. నియంత్రిత సాగు విధానం అమలయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశంతో పరిశోధన శాఖ , మార్కెటింగ్ అంచనాల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రైతులకు కావలసిన వనరులను సమకూర్చి.. వాటిని ఏ సమయంలో ఎలా వినియోగించాలనేది అధ్యయనం చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ఆధారంగా రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు.