తెరాసకు బలమైన స్థానాల్లో దుబ్బాక ఒకటి. కేసీఆర్ సొంత జిల్లాలో ఆది నుంచి విజయాలు సాధించింది. 2014 ఎన్నికల్లో 37,925, 2018లో 62,500 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ దుబ్బాక సెగ్మెంటులో కాంగ్రెస్‌పై తెరాస 52,478 ఆధిక్యం సాధించింది. అనారోగ్యంతో రామలింగారెడ్డి చనిపోగా.. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రామలింగారెడ్డి కుమారుడు టికెట్ ఆశించినప్పటికీ పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత కారణంగా రామలింగారెడ్డి భార్య సుజాతను బరిలో నిలిపారు. ఆది నుంచి బలంగా ఉండడం, సీఎం సొంత జిల్లా కావడంతోపాటు సానుభూతి కూడా కలిసొస్తుందని పార్టీ అంచనా వేసింది.
దుబ్బాకను ఆనుకునే సీఎం నియోజకవర్గమైన గజ్వేల్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేట ఉండటంతో ఉప ఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. మంత్రి హరీశ్‌రావు మొదటి నుంచి ప్రచార బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్నారు. దుబ్బాక అభివృద్ధి తన బాధ్యతంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెరాస నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినా అది తమకేమీ ఇబ్బంది కాకపోవచ్చని పార్టీ భావించింది. భాజపా నుంచి అంత తీవ్రమైన పోటీ ఉండదనుకుంది. క్రమేపీ భాజపా పుంజుకోవడం, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు దూకుడుగా వ్యవహరించడంతో తెరాస దానిని ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లభ్ధిదారులపై పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల నాటికి భాజపా గట్టిపోటీదారుగా మారినా.. మెజారిటీ తగ్గుతుందేమో కానీ ఓటమి పాలయ్యేంత ప్రభావం ఉండదని తెరాస బలంగా విశ్వసించింది. అయితే అనూహ్య పరాజయం ఎదురైంది.