Inavolu Mallanna Jatara 2023 : జానపదుల జనజాతరగా పేరొందిన ఐనవోలు మల్లన్న జాతరకు ,సంక్రాంతి సందర్భంగా దేవాలయ పరిసరాలు భక్త జనసంద్రంగా మారుతున్నాయి. మల్లికార్జునస్వామి జాతర సంక్రాంతి రోజు ప్రారంభమై ఉగాది వరకూ కొనసాగుతుంది. కండేల రాయుడు, మల్లన్న స్వామి, మల్లర దేవుడిగా పూజలందుకునే మల్లికార్జున స్వామి ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం, ఖడ్గం, నెత్తిన కిరీటం, కోరమీసాలతో భక్తులకు దర్శనమిస్తారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ పరిసరాల్లోనే విడిది చేస్తూ, నెత్తిన బోనాలు ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ, స్వామికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. ఒగ్గు పూజారులు పటాలు వేసి మల్లన్నను స్తుతిస్తున్నారు. ఆలయ ఆవరణలో శివసత్తుల నృత్యాలు పూనకాలు హోరెత్తుతున్నాయి. స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, ఇతర పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
అట్టహాసంగా కొమ్మరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. అగ్నిగుండాలను దాటిన భక్తులు
ఏడాదికోసారి జరిగే మలన్న జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మార్నేని వంశస్థులు సంప్రదాయంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న రేణుక ఎల్లమ్మ పండుగ, మార్చి 8 మహా శివరాత్రి పర్వదినాన శివకల్యాణం వైభవంగా జరుగుతాయి. ఏప్రిల్ 9న ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం మహా పంప్రోక్షణ అనంతరం జాతర ముగుస్తుంది.