హుస్నాబాద్ మండల కేంద్రంలోని శివారులో ఉన్న పంటపొలాల్లో రైతులు మొక్కజొన్నతో పాటు వివిధ కాయగూరలు పండిస్తున్నారు. పంటలపై వానర సైన్యం దండెత్తి... పంటలను పాడుచేస్తోంది. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు.. బాంబులు, డబ్బులు కొట్టటం, చీరలు కట్టటమే కాకుండా.. రోజంతా కావలి కాయటం లాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్ని చేసినా.. ఫలితం మాత్రం తాత్కాలికంగానే కన్పిస్తోంది. తర్వాత మళ్లీ ఎప్పటిలాగే.. దండయాత్రను ఎదుర్కోవాల్సి వస్తోంది.
తలో రూపాయి వేసుకుని...
కోతులను భయపెట్టేందుకు కొండముచ్చులు ఒక్కటే మార్గం. వాటిని కొనటం తలకు మించిన భారమని భావించిన రైతులు... చాకచక్యంగా వ్యవహరించారు. అందరు కలిసి తలో రూపాయి వేసుకున్నారు. పోగైన డబ్బుతో... కొండముచ్చుల ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించారు. పొలాల్లో అక్కడక్కడా ఆ ఫ్లెక్సీలను కట్టారు. వీటిని చూసిన కోతులు... నిజంగానే కొండముచ్చులున్నాయని భ్రమపడి.. భయంతో అటువైపు చూడటమే మానేశాయి. ఫ్లెక్సీల ప్లాన్ ఇచ్చిన ఫలితంతో.. కోతుల బెడద నుంచి ఇప్పటివరకైతే కొంత ఉపశమనం దొరికిందని రైతులు చెబుతున్నారు.
- కాస్త ఉపశమనం దొరికింది...