సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చడంలో ఆర్ అండ్ బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్లలో ప్రయాణించిన ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని, గుంతల్లో పడి ప్రాణాలు సైతం పోతున్నా ఆర్ అండ్ బీ అధికారులు స్పందించడం లేదని.. వారిపై చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రోడ్డుపై గుంతలు పూడ్చలేదని.. ఆర్ అండ్ బీ అధికారులపై ఫిర్యాదు! - హుస్నాబాద్ పట్టణం
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చడంలో ఆర్ అండ్ బీ అధికారులు విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం అమాయకులు ప్రమాదాలకు గురవుతున్నారని పట్టణ కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై గుంతలు పూడ్చి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.
![రోడ్డుపై గుంతలు పూడ్చలేదని.. ఆర్ అండ్ బీ అధికారులపై ఫిర్యాదు! Husnabad Congress Leaders Complaints On R And B Officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8290156-843-8290156-1596536453765.jpg)
హుస్నాబాద్ పట్టణం నాలుగు జిల్లా కేంద్రాలకు సరిహద్దుల్లో ప్రధాన కేంద్రంగా ఉందని, పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు ఇతర రోడ్లన్నీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. గుంతల్లో పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలను పూడ్చాలని పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు వెంటనే స్పందించిన అధికారులు ప్రధాన రహదారుల్లో ఏర్పడిన గుంతలను పూడ్చి తాత్కాలికంగా మరమ్మత్తు చేయించారు. రహదారుల మరమ్మత్తుకు నిధులు మంజూరు అయ్యాయని వానాకాలం తర్వాత శాశ్వతంగా రహదారులను మరమ్మతులు చేయిస్తామని ఆర్ అండ్ బీ ఏఈ సాజిద్ తెలిపారు.