సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన మల్లన్నసాగర్ పునరావాస కాలనీలో.. మరో ఇంటి మెట్ల గోడ కూలిపోయింది. ఘటనా సమయంలో.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా.. వరుసగా 2 ఇళ్లకు సంబంధించిన మెట్ల గోడలు ధ్వంసమవడంతో నిర్వాసితులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎమవుతుందో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు: ఆర్డీవో
ఘటనపై స్పందించిన గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి.. పునరావాస కాలనీలోని ఇళ్లు పూర్తిగా ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మితమయ్యాయన్నారు. భూ నిర్వాసితుల కోరిక మేరకు ఇటీవలే మెట్ల కింద అదనపు టాయిలెట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. తొందరగా ఇళ్లను అప్పగించడంతో.. అదనంగా నిర్మించిన టాయిలెట్‌లకు సరిగా క్యూరింగ్ చేయకపోవడంతో గోడలు కూలిపోతున్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణాలు.. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరిగాయంటూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
ఇదీ చదవండి:పోలీస్స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ 'పెళ్లి' పంచాయితీ