సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అర్ధరాత్రి దాదాపు రెండు గంటల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి పట్టణంలోని డిపో గ్రౌండ్లో రైతులు ఆరబెట్టిన వరిధాన్యం పూర్తిగా తడిసి పోయింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్థరాత్రి అకాల వర్షం... పూర్తిగా తడిసిపోయిన వరిధాన్యం
అర్థరాత్రి కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం పూర్తిగా తడిసిపోయిన ఘటన హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్‌లో ఆరబోసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
కరోనా నేపథ్యంలో హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో వరి ధాన్యాన్ని ఆరబోసుకోడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. డిపో గ్రౌండ్లో ఆరబోసుకుంటే టార్పాలిన్ కవర్లు సరిపోక వరి ధాన్యం తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ యార్డులో తమ ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి వ్యవసాయ అధికారులు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. జాప్యం చేయకుండా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం