రాష్ట్రంలో రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాల్లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా సాగింది. ఖమ్మంలో 60 డివిజన్లకు గానూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మెుత్తం 417 మంది నామినేషన్లు వేయగా.... 522 నామపత్రాలు దాఖలయ్యాయి. కేవలం ఆఖరి రోజునే 377 నామపత్రాలు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తెరాస నుంచి అత్యధికంగా 163 నామినేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ తరపున 125 దాఖలవ్వగా.... భాజపా నుంచి 84 నామపత్రాలు వేశారు. జనసేన 12, సీపీఎం 35 , సీపీఐ నుంచి ఏడు నామినేషన్లు దాఖయ్యాయి. అన్ని డివిజన్లలో కలిపి స్వతంత్రులు 76 మంది నామపత్రాలు అందజేశారు. అత్యధికంగా 43వ డివిజన్ లో 14 మంది అభ్యర్థులు 18 నామినేషన్లు దాఖలు చేశారు.
గ్రేటర్ వరంగల్‌లో చివరి రోజు నామినేషన్లు పోటెత్తాయి. మొత్తం వెయ్యి 10 మంది అభ్యర్ధులు 1487 సెట్ల నామపత్రాలు సమర్పించారు. 66 డివిజన్లలోనూ 12 వందల 14 మంది 17 వందల 53 నామినేషన్లు వేశారు. ఇందులో తెరాస 706, భాజాపా 294, కాంగ్రెస్ 247 మంది నామినేషన్ దాఖలు చేశారు.