వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత దుబ్బాక ఉపఎన్నిక రాజకీయ రసవత్తరంగా మారుతోంది. సోమవారం రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోదాలతో మొదలైన రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు.
తెరాస కుట్రలు...
సిద్దిపేటకు వెళ్తుండగా సోమవారం సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా ఆయన దీక్ష చేపట్టారు. దుబ్బాకలో భాజపా గెలవబోతుందన్న సంజయ్... ఎన్నికలను వాయిదా వేయించేందుకు తెరాస కుట్రలు దిగుతోందని ఆరోపించారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ... ఓటమి భయంతోనే తెరాస నిర్బంధ చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
పోలీసుల బందోబస్తు...
భాజపా నేతలు ప్రగతిభవన్ ముట్టడిస్తారనే ఊహాగానాల నడుమ పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. తార్నాకలోని ఎమ్మెల్సీ రాంచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కరీంనగర్‌కు వెళ్లేందుకు యత్నించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళహాట్ పోలీసులు గృహనిర్బంధం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు...
దుబ్బాకలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తా, మౌలాలి హౌసింగ్ బోర్డ్ వద్ద నిరసనలు చేపట్టాయి. ఖమ్మంలో నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తల పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీచూడండి:దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్.. ప్రగతిభవన్ వద్ద భారీగా బలగాలు