ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి సిద్దిపేట పర్యటన కోసం జిల్లా యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. వెయ్యి కోట్లతో చేపట్టిన వివిధ పథకాలను ప్రజలకు అంకితం చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సిద్దిపేట కేసీఆర్ స్వస్థలం కావడం వల్ల మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పర్యటన విజయవంతానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఐటీ టవర్స్‌కి భూమిపూజ చేయనున్నందున... కావాల్సిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో... బహిరంగ సభ ఏర్పాటు చేస్తుందున భారీగా తరలివచ్చే ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంతకుముందు సిద్దిపేటలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడకగదుల ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. సీఎం ఆశీస్సులతో 2 వేల 460 పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు వివరించారు. నిజమైన పేదలకు దక్కాలని ఆర్నెళ్లు శ్రమించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రికి మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతామని హరీశ్ రావు వెల్లడించారు.