తెలంగాణ

telangana

ETV Bharat / state

Harishrao: 'సిద్దిపేటలో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి' - Telangana latest news

HarishRao in May Day celebrations: ఈ విశ్వంలో అలసిపోకుండా నిరంతరం వెలుగును ఇచ్చేవాడు సూర్యుడైతే.. అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసే వాడు కార్మికుడని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. మే డే సందర్భంగా సిద్దిపేట బీఆర్​టీయూ-ట్రేడ్ యూనియన్ సమావేశానికి హాజరై.. పట్టణంలో త్వరలో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రి, ఈఎస్​ఐ- డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తామన్నారు.

harish rao
harish rao

By

Published : May 1, 2023, 10:24 PM IST

HarishRao in May Day celebrations: ప్రపంచంలో అతి పెద్ద కులం కార్మికుల కులం.. మనమంతా కార్మికులమే.. శ్రామికులకు కులం, మతం లేదని, కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పని చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట శ్రీనివాస టాకీస్​లో సోమవారం మధ్యాహ్నం బీఆర్​టీయూ-ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అలసిపోకుండా నిరంతరం వెలుగును ఇచ్చేవాడు సూర్యుడని.. అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసే వాడు కార్మికుడని మంత్రి కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉందన్నారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో బీడీలు చేసే కార్మికులను పట్టించుకోలేదని, ఆ విషయం మహిళా మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని వాపోయారు.

ప్రపంచానికి సూర్యుడు వెలుతురు ఇస్తే.. కార్మికుడు తన చెమట చుక్కలతో పని చేసి అందరీ జీవితంలో వెలుగు నింపుతారని కొనియాడారు. బీడీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.6 లక్షల బీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని, కార్మిక లోకం కలసి పని చేయాలని, కార్మికులను సంఘటితం చేయాలని కోరారు. సిద్దిపేటలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వెయ్యి పడకల ఆసుపత్రి రాబోతున్నదని, త్వరలోనే ఈఎస్ఐ - డిస్పెన్సరీ కార్మికుల కోసం తేనున్నామని మంత్రి వెల్లడించారు.

ఒకప్పుడు బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని పోయేవారని, కానీ ఇవాళ బతుకు దెరువు చూపే తెలంగాణగా పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి ఇక్కడ పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

"కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోంది. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో బీడీలు చేసే కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీడీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు రూ.6 లక్షల బీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తోంది. సిద్దిపేటలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వెయ్యి పడకల ఆసుపత్రి రాబోతోంది. త్వరలోనే ఈఎస్ఐ - డిస్పెన్సరీ కార్మికుల కోసం ఏర్పాటు చేయనున్నాం." -హరీశ్​రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details