Harish Rao on Telangana Development :పాలనాదక్షత కలిగిన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పేందుకు.. తెలంగాణనే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు (Harish Rao ) గుర్తుచేశారు. సిద్దిపేటతో పాటు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణది మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇంతకు ముందు పంజాబ్, హరియాణా ఉండేదని.. ఇప్పుడు వాటిని దాటవేసి రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉందని తెలిపారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Speech in Siddipet District :డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్ స్థానంలో ఉన్నట్లుహరీశ్రావు వివరించారు. రాష్ట్రంలో ప్రతిలక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, పంజాబ్, గుజరాత్లో కరెంట్ కోతలు ఉన్నాయని.. కానీ తెలంగాణలో కరెంట్ కోతలు లేవని వివరించారు. ప్రతిపక్షాలు తిట్లలో పోటీ పడితే.. తాము అభివృద్ధిలో పోటీ పడుతున్నామని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ ఐటీ అని మాత్రమే అనేవారని.. కానీ ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఐటీతో పాటు వ్యవసాయంలోనూ వృద్ధి చెందిదని వివరించారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఐటీలో 2014కు ముందు 3.50 మంది లక్షల ఉద్యోగాలు చేసేవారని .. కానీ ఇప్పుడు 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని హరీశ్‌రావు వివరించారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణకు.. పల్లెలో 38 శాతం ఉత్తమ గ్రామాలుగా అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. 28 శాతం పట్టణాలకు అవార్డులు వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ, ఉత్తమ ఆసుపత్రులు, వైద్యం, ఇలా తదితర రంగాల్లో అవార్డులు వచ్చాయని హరీశ్‌రావు వెల్లడించారు.
Harish Rao on Siddipet Development :ఈ క్రమంలోనే దిల్లీలో అవార్డులు ఇస్తారని.. గల్లీలో తిడతారని హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ, అటవీ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. సిద్దిపేట మెడికల్ హబ్‌గా మారుతుందని.. 1000 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.