తెలంగాణ

telangana

ETV Bharat / state

'మీరు దిల్లీ నుంచి డబ్బులు తెస్తే.. నేను దుబ్బాకకు అడిగనన్ని నిధులిస్తా'

Harish Rao Challenge to Raghunandan Rao: రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు నిధుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. లబ్ధిదారులకు నేరుగా డబ్బు అందజేయకుండా ఆ నిధులకు సరిపడా వారికి ఉపాధి కోసం హార్వెస్టర్లు, ట్రాలీ ఆటోలు తదితర వాటిని పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు పలు వాహనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్​ రావు సైతం పాల్గొన్నారు.

dalit bandhu funds distribution in dubbaka
దుబ్బాకలో దళిత బంధు నిధుల పంపిణీ

By

Published : Apr 14, 2022, 9:44 PM IST

Harish Rao Challenge to Raghunandan Rao: 'మీరు దిల్లీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు తెస్తే.. మీ దుబ్బాక నియోజకవర్గానికి మీరడిగినన్ని నిధులు నేను ఇస్తానన'ని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావును ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. గతేడాది రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్ల నిధులను కేంద్రం ఎగ్గొట్టిందని.. ఆ సొమ్మును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఓ హాలులో.. దళిత బంధు పథకం కింద దుబ్బాక మండలం అరెపల్లి గ్రామం, దౌల్తాబాద్ మండలం మహ్మద్ షాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు హార్వెస్టర్లు, ట్రాలీ ఆటోలు, కార్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.

చిన్నారిని ఎత్తుకుని మంత్రి హరీశ్ రావు సందడి

దేశంలోనే దళితులకు రూ. పది లక్షలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ అన్నారు. ఆ నిధులతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని లబ్ధిదారులకు సూచించారు. అంబేడ్కర్ కలలు కన్న నిజమైన ఆర్థిక సామాజిక న్యాయం జరిగేలా.. అన్ని రంగాల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్​దే అని కొనియాడారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుకు హరీశ్ రావు సవాల్ విసిరారు. దిల్లీ నుంచి రాష్ట్రానికి హక్కుగా రావల్సిన నిధులు తేవాలని.. అప్పుడు నియోజకవర్గానికి తామడిగినన్ని నిధులు నేను ఇస్తానని స్పష్టం చేశారు. ధాన్యం కొనేది లేదని కేంద్రం చెప్పినా.. రైతులను కాపాడాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు హరీశ్ పేర్కొన్నారు. ఇదే సంవత్సరంలో మరో 17 వందల మందికి దళిత బంధు ఇస్తామని హరీశ్ హామీ ఇచ్చారు.

దళితబంధు లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

ABOUT THE AUTHOR

...view details