Harish rao about omicron : రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని... ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా టీకా రెండో డోసు కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 27వ మున్సిపల్ వార్డు గణేష్ నగర్లో రూ.15 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, 21వ వార్డు కుషాల్ నగర్లో రూ.72 లక్షల నిధులతో నిర్మించిన నైట్ షెల్టర్, నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
కేసులు పెరిగే అవకాశం
కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు పలు సూచనలు చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆయన అన్నారు. ఎలాంటి అనుమానాలు లేకుండా గర్భిణీలు సైతం వ్యాక్సిన్ తీసుకోవచ్చునన్నారు. ఆస్పత్రి వరకు రాలేని వారి కోసం ఇంటికే వచ్చి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు.
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలకు చెక్
గణేష్ నగర్ మహిళా భవన నిర్మాణం పదేళ్ల పంచాయతీ ఇవాళ్టితో నెరవేరిందని మంత్రి అన్నారు. ఇంకా అదనంగా కాంపౌండ్ వాల్ కోసం కావాల్సిన నిధులు, 6వ వార్డులో మహిళా భవనం మరమ్మతులకు అవసరమైన నిధులు సమకూర్చి 3 నెలల్లోపు పూర్తి చేస్తామని ఆయా వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని... రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో పట్టణంలో తాగునీటి గోస ఉండేదని... మిషన్ భగీరథతో నీటి కష్టాలకు చెక్ పడిందన్నారు.