తెలంగాణ

telangana

ETV Bharat / state

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్టు.. నిరసనగా సర్పంచ్‌ ఆమరణ నిరాహార దీక్ష - Akkannapet mandal latest news

Gudathipalli Sarpanch Hunger Strike: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు మరోసారి నిరసన చేపట్టారు. తమవారిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గుడాటిపల్లి గ్రామ సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పరిహారం చెల్లించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Gudathipalli
Gudathipalli

By

Published : Mar 5, 2023, 4:17 PM IST

Gudathipalli Project residents Protest: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్టును నిరసిస్తూ.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామ సర్పంచ్ బద్దం రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారం కోసం.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 120 మందికి పైగా వివాహిత యువతులకు, 14 ఇళ్లకు పరిహారం ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట తప్పారని రాజిరెడ్డి ఆరోపించారు.

2013 భూసేకరణ చట్టాన్నే అమలు చేయలేదు: ఖాళీ స్థలంలో ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు ఇచ్చే పథకంలో భాగంగా.. తన నియోజకవర్గానికి వచ్చే 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ముందు నిర్వాసితులకే ఇస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అటకెక్కిందని రాజిరెడ్డి తెలిపారు. అదేవిధంగా 84 ఎకరాలకు సంబంధించిన పరిహారం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అసలు గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో 2013 భూసేకరణ చట్టాన్నే అమలు చేయలేదని విమర్శించారు. ఖచ్చితంగా తమకు రావాల్సిన పరిహారం ఇచ్చేంత వరకు.. గ్రామస్తుల సహకారంతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని బద్దం రాజిరెడ్డి స్పష్టం చేశారు.

"తమను అర్థరాత్రి పోలీసులు నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేశారు. 120 మందికి పైగా వివాహిత యువతులకు, 14 ఇండ్లకు పరిహారం ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మాట తప్పారు. తన నియోజకవర్గానికి వచ్చే 1500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ముందు నిర్వాసితులకే ఇస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అటకెక్కింది. 84 ఎకరాలకు సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. అసలు గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో 2013 భూ సేకరణ చట్టాన్నే అమలు చేయలేదు. పరిహారం చెల్లించే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాం." - రాజిరెడ్డి, గుడాటిపల్లి గ్రామ సర్పంచ్

పరిహారం కోసం భూ నిర్వాసితుల ఆందోళనలు:జలయజ్ఞంలో భాగంగా గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో పనులు ప్రారంభించారు. తెలంగాణ వచ్చాక.. దానిని ఎనిమిదిన్నర టీఎంసీలకు పెంచారు. గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పనులు పూర్తయ్యాయి. తోటపల్లి నుంచి రేగొండ పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రయల్‌రన్ చేస్తామని గతంలో హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో భూ నిర్వాసితులు ఆందోళనలు చేప్టటారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసుల తీరును ప్రతిపక్షాలు తప్పుబ్టటాయి. భూ నిర్వాసితులపై దాడిని తీవ్రంగా ఖండిచాయి. ఇవ్వాల్సిన పరిహారం మొత్తం ఇచ్చాకే ప్రాజెక్టు పనులు చేయనిస్తామని.. లేకుంటే పనులు అడ్డుకుంటామని గతంలోనే భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల అరెస్టు.. నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సర్పంచ్‌

ABOUT THE AUTHOR

...view details