సిద్దిపేటను హైదరాబాద్‌తో అనుసంధానం చేసే రాజీవ్‌రహదారి... హరితమయంగా మారింది. ఆకుపచ్చని చెట్లతో జిల్లావాసులతో పాటు రోడ్డుపైవెళ్లే వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది. భాగ్యనగరం నుంచి రామగుండం వరకు 207 కిలోమీటర్లు ఉన్న రహదారి... సిద్దిపేట జిల్లాలో 92 కిలోమీటర్లు ఉంటుంది. ఇది జిల్లాలోని రెండు పురపాలక సంఘాలు, 33గ్రామాల గుండా పోతుంది. ఈ రోడ్డును హరితమయం చేసేందుకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగేళ్లలో గ్రీన్‌వాల్‌గా మార్చారు.
నాలుగేళ్ల కృషికి నిదర్శనం...
అటవీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సమన్వయం చేసిన మంత్రి హరీశ్‌రావు.. 2016లో రాజీవ్ రహదారిపై హరితహారంలో భాగంగా మొక్కలు నాటించారు. రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు పెంచారు. సంరక్షణ బాధ్యతను స్థానిక పంచాయతీలకు, ఉపాధి హమీ విభాగానికి అప్పగించారు. ఏదైనా మొక్క చనిపోతే.. మరో మొక్కను నాటి సంరక్షించారు. నాలుగేళ్లలో మొక్కలు.. చెట్లుగా ఎదిగాయి. ప్రస్తుతం రాజీవ్ రహదారికి రెండువైపుల కిలోమీటరుకు 800 చెట్లు ఉండగా... రోడ్డు మధ్యలో రంగు రంగుల పూల మొక్కలు 200లకు పైగా ఉన్నాయి. ఇలా రెండు వైపులా కలిపి 184 కిలోమీటర్ల పచ్చనితోరణం రహదారిపై ఆవిష్కృతమైంది.