తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యార్థులు దేశానికి సేవ చేయడానికి ముందుకొస్తుండటం శుభపరిణామం'

సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా ఆహారంలో కూరగాయలు, పండ్లు ముఖ్యమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. కొవిడ్ సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత చూశామని.. పౌష్టికాహారం పట్ల పాఠాలు నేర్చుకున్నామని ఆమె పేర్కొన్నారు. సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన రెండో స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్​.. ఆహార వనరులు, నియమాలపై కీలక ప్రసంగం చేశారు.

Governor Tamilisai
Governor Tamilisai

By

Published : Dec 23, 2022, 5:59 PM IST

దేశంలో ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్, ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సిద్దిపేటలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన రెండో స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్‌.. ఎంబీబీఎస్‌కు దీటుగా విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తద్వారా విద్యార్థులు దేశానికి సేవ చేయడానికి ముందుకొస్తుండటం శుభపరిణామని పేర్కొన్నారు.

పండ్లు, కూరగాయల ప్రాధాన్యత చూశాం..:వాతావరణ మార్పుల నేపథ్యంలో పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో ఉద్యాన శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ కొనియాడారు. సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా సమతుల్య ఆహారంలో కూరగాయలు, పండ్లు ముఖ్యమని వర్ణించిన గవర్నర్.. కొవిడ్ సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత చూశామని.. పౌష్టికాహారం పట్ల పాఠాలు నేర్చుకున్నామని వ్యాఖ్యానించారు. అందమైన వనాల రూపకల్పనలో ఉద్యాన పట్టభద్రుల కృషి ఉందని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు ఓ భాగమని తమిళిసై చెప్పుకొచ్చారు.

ఔషధ పంటల‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు విస్తృతం చేయాలని.. పండ్లు, కూరగాయలు, పూల పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం కృషి చేయాలని కోరారు. మన పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకునే వారని.. దాంతో దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, మధుమేహం లేవని గుర్తు చేశారు. తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నందున.. అన్ని రకాలు ఆహారంలో భాగం చేసుకుంటారని తమిళిసై తెలిపారు. అదే తెలుగు నేలపై పాలీష్డ్ రైస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

చిరుధాన్యాలు భాగం చేసుకోవాలి..: మనం తీసుకునే ఆహారంలో బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని గవర్నర్​ సూచించారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 575 మందికి గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. వీరిలో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్‌డీ పట్టభద్రులు ఉన్నారు. అలాగే అండర్ గ్రాడ్యుయేట్‌లో మూడు బ్యాచ్‌లు వారికి బంగారు పతకాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆనంద్ కుమార్ సింగ్, వర్సిటీ ఉపకులపతి డాక్టర్ నీరజా ప్రభాకర్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details