తెలంగాణ

telangana

ETV Bharat / state

రణరంగమైన హుస్నాబాద్‌.. లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ నేడు బంద్‌.. - tension in gudatipally

Gudatipally Riots latest news : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి వాసులు హుస్నాబాద్‌లో చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. పోలీసులు, తెరాస నాయకులు, భూ నిర్వాసితులకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. చేతికి దొరికిన వాటితో కొట్టుకున్నారు. ఈ ఉద్రిక్తతల్లో భూనిర్వాసితులకు, పోలీసులకు గాయాలయ్యాయి.

Gauravelli Land Expatriates
Gauravelli Land Expatriates

By

Published : Jun 15, 2022, 7:52 AM IST

Gudatipally Riots latest news : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయరు వల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి వాసులు మంగళవారం హుస్నాబాద్‌లో చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. పోలీసులు, తెరాస నాయకులు, భూ నిర్వాసితులకు మధ్య తీవ్రమైన తోపులాట ఘర్షణకు దారితీసింది. ఒక దశలో మూడు వర్గాలవారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చేతికి అందిన వాటితో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఏసీపీ వాసాల సతీశ్‌ తలకు గాయం కాగా, ఎస్‌ఐ శ్రీధర్‌ కిందపడిపోయారు. భూనిర్వాసితులైన ముగ్గురు మహిళలు గాయపడ్డారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నం..

సోమవారం గుడాటిపల్లిలో జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ కాంగ్రెస్‌ మంగళవారం చేపట్టిన హుస్నాబాద్‌ బంద్‌లో నిర్వాసితులు పాల్గొన్నారు. పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించిన అనంతరం స్థానిక ఫంక్షన్‌ హాలులో భోజనాలుచేసి విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో తెరాసకు చెందిన కొందరు గౌరవెల్లి రిజర్వాయరు ట్రయల్‌రన్‌ జరిపి త్వరగా సాగునీరందించాలని కోరుతూ రైతులతో కలసి ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తామని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇందుకోసం అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలిరావాలని, మార్కెట్‌ యార్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు వరంగల్‌-సిద్దిపేట రహదారిపై రెండుగంటలకు పైగా బైఠాయించి ఆందోళన చేశారు.

పట్టుబట్టి.. తెరాస ర్యాలీ..

అదే సమయంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వివిధ మండలాల నుంచి వచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామని చెప్పగా పోలీసులు వారించారు. వినతిపత్రం ఎలా ఇస్తారో చూస్తామంటూ సమీపంలోనే ఉన్న నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వారు పోటాపోటీగా నినాదాలు చేశారు. ర్యాలీకి సిద్ధమైన తెరాస కార్యకర్తలను నిర్వాసితులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు వారిస్తున్నా పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు, నిర్వాసితులు, తెరాస నేతలు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. పక్కనే ఉన్న పాత ఇనుప సామాను దుకాణంలోని ప్లాస్టిక్‌ పైపులతో నిర్వాసితులు, పోలీసులు దాడి చేసుకున్నారు. నిర్వాసితులు చెప్పులు, రాళ్లు విసరగా, ఏసీపీ సతీశ్‌కు గాయమైంది. హుస్నాబాద్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, పలువురు నిర్వాసితులు కింద పడిపోయారు. ఒకవైపు ఘర్షణ జరుగుతుండగానే తెరాస నాయకులు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరారు. హనుమకొండ జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌, సిద్దిపేట జడ్పీ వైస్‌ఛైర్మన్‌ రాజారెడ్డి, హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఆకుల రజిత, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతో కలసి తెరాస నాయకులు ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దారు మహేశ్‌కు వినతిపత్రం అందచేశారు. తమపై దాడికి పాల్పడిన కొందరు నిర్వాసితులను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తుండగా మహిళలు అడ్డుకోవడంతో స్టేషన్‌ వద్ద మరోసారి తోపులాటలు జరిగాయి. ఇక్కడ కాల్వల సుమలత, నల్ల సూరవ్వ, అనితలకు గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఠాణా ముందు నిర్వాసితులు బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత వారు ఠాణా నుంచి వెళ్లి పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద మరోసారి రాస్తారోకో చేపట్టగా భాజపా నాయకులు సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు.

లాఠీఛార్జిపై హైకోర్టు, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం..

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై జరిగిన లాఠీఛార్జి ఘటనపై హైకోర్టును, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. మంగళవారం రాత్రి అక్కన్నపేట మండలం గుడాటిపల్లి నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. లాఠీఛార్జిలో గాయపడిన యువకులు, మహిళలను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. లాఠీఛార్జి ఘటనను బుధవారం గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు హామీ ఇచ్చారు. లాఠీఛార్జికి కారణమైన సీఐ రఘుపతిరెడ్డిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details