తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్రిక్తంగా మారిన గుడాటిపల్లి భూనిర్వాసితుల ఆందోళన.. - Gauravelli Project News

Gauravelli Land Expatriates: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లి భూ నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ అడ్డుకుంటారని పోలీసులు వారిని... అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడాన్ని నిరసిస్తూ... హుస్నాబాద్‌కు తరలివచ్చిన నిర్వాసితులు... ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ముట్టడికి ప్రయత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మరోసారి తోపులాట జరిగింది.

Gauravelli
Gauravelli

By

Published : Jun 13, 2022, 5:00 PM IST

Updated : Jun 13, 2022, 7:55 PM IST

గౌరవెల్లి భూ నిర్వాసితుల ఆందోళన... అడ్డుకున్న పోలీసులు

Gauravelli Land Expatriates: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు మూడ్రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్‌ను నిర్వహించనున్న నేపథ్యంలో... అడ్డుకుంటారనే ఉద్దేశంతో గుడాటిపల్లిలో భూ నిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లకు తరలించే క్రమంలో పోలీసులకు, భూ నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ప్రభుత్వం, అధికారులు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి... అర్ధరాత్రి వేళ పోలీసులతో దౌర్జన్యంగా ఇండ్లపై దాడి చేయించడం ఏంటని భూనిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడాన్ని నిరసిస్తూ... సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు భూ నిర్వాసితులు... తరలివచ్చారు. ఆర్డీఓ కార్యాలయం ముందు వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. దీంతో నిర్వాసితులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు ఏసీపీ సతీశ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అదనపు కలెక్టర్ నిర్వాసితులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా... అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

స్పందించిన సీపీ: గుడాటిపల్లి భూ నిర్వాసితుల ఘటనపై సీపీ శ్వేతా రెడ్డి స్పందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లిలో ప్రాజెక్ట్ కెనాల్ సర్వేకు సంబంధించి కొంతమంది భూ నిర్వాసితులు అడ్డుకుంటున్నారని ఇరిగేషన్ అధికారుల నుంచి ఫిర్యాదు వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు గుడాటిపల్లి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులకు సర్వే చేయడానికి సహకరించామని... అడ్డుకోవాలని ప్రయత్నించిన నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే సమయంలో తోపులాట జరిగిందన్నారు. అంతేకాని వారిపై లాఠీఛార్జ్ జరగలేదని వెల్లడించారు. రైతులపై, మహిళలపై ఎలాంటి అదనపు ఫోర్స్​ను వినియోగించలేదన్నారు. పంపు హౌస్ వద్ద ఎలాంటి ఆటంకాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులను ఎలాంటి ఇబ్బంది పెట్టే చర్యలకు గురి చేయడం లేదన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్వాసితులతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

గుడాటిపల్లిలో ప్రాజెక్ట్ కెనాల్ సర్వే అడ్డగింతపై ఫిర్యాదు వచ్చింది. గుడాటిపల్లిలో బందోబస్తు ఏర్పాటు చేసి సర్వే చేయడానికి సహకరించాం. నిర్వాసితులను అదుపులోకి తీసుకునే సమయంలో తోపులాట జరిగింది. గుడాటిపల్లి భూనిర్వాసితులపై లాఠీచార్జ్‌ చేయలేదు. రైతులు, మహిళలపై అదనపు బలగాలను వినియోగించలేదు. పంప్‌హౌస్ వద్ద ఆటంకాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు. భూమి కోల్పోతున్న వారిని ఇబ్బందిపెట్టేలా వ్యవహరించలేదు. -- శ్వేతారెడ్డి, సీపీ

ఇదీ చదవండి :

Last Updated : Jun 13, 2022, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details