సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామంలో పౌరసరఫరాలు, బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తమను కించపరిచారని గంగపుత్ర చైతన్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేపలు పట్టే వారు ముదిరాజులే అని మాట్లాడిన మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం అధ్యక్షుడు పూస సత్యనారాయణ బెస్త అన్నారు.
వారికి మొదట పండ్లు..ఆ తర్వాతే చేపలు !
ముదిరాజుల కుల వృత్తి పండ్లు అమ్ముకోవడమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసిన మాటలను మంత్రి గుర్తు చేసుకోవాలన్నారు. బెస్తలకే తొలి హక్కు అని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను బీసీ మంత్రి గంగుల కమలాకర్ తుంగలో తొక్కారని అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజులు తొలుత పండ్లు అమ్ముతారని...ఆ తర్వాతే చేపల వృత్తని అన్నారు.
చేపలు తప్ప మాకేవృత్తి లేదు..
కానీ గంగపుత్రులు మాత్రం సనాతన మత్స్యకారులని.. తాము చేపల వృత్తి తప్ప మరే ఇతర వృత్తి లేదన్నారు. చేపలు వృత్తిపై మొదటి హక్కు గంగపుత్రులదేనని సత్యనారాయణ పేర్కొన్నారు. మొదట మంత్రి గంగుల గంగపుత్రుల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఒక మంత్రి స్థానంలో ఉంటూ మత్స్యకార వృత్తిపై ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.