సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రాపూర్‌కు చెందిన బినవేని రాజయ్య, కాంతవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్దవాడైన రామ్ గ్రామంలో మూడో తరగతి వరకు చదివారు. అప్పట్లో భారీ వర్షాలతో వరదలు రావడం, పంటలకు తీవ్ర నష్టం కలగడంతో ఎనిమిదేళ్ల వయసులో చదువు మానేశారు. తర్వాత పన్నెండేళ్ల పాటు కూలీగా, వాహన డ్రైవర్‌గా పని చేశారు. తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు వ్యవసాయం చేశారు. ఓసారి డ్రైవరుగా మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి విద్యాలయాలు ఉదయం 8 నుంచి 12 గంటల వరకే నడిచే తీరును గమనించారు.
తెలంగాణలో సైతం ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుండునని, తాను ఉదయం చదువుకొని, మధ్యాహ్నం పనికి వెళ్లొచ్చని భావించారు. ఇంటికి వచ్చిన తర్వాత అలాంటి అవకాశం ఏదైనా ఉందా? అని తెలిసిన వారిని అడిగితే దూరవిద్య గురించి చెప్పారు. ఏ మాత్రం అలోచించకుండా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి 2003లో బీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో క్యాంపస్ సీటు సాధించారు. పీజీ (2005) తర్వాత ఓయూలోనే ఎంఫిల్ (2007), పీహెచ్‌డీ (2010) పూర్తి చేశారు. ఆంగ్లంపై పట్టు సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ఆ తర్వాత నెట్‌లో అర్హత సాధించి ఓయూలో సహాయ ఆచార్యుడిగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా డాక్టర్ అంబేడ్కర్ ఓవర్‌సీస్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. తాను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌ను ఎంపిక చేసుకున్నట్లు రామ్ తెలిపారు. ఈ ఫెలోషిప్ రెండేళ్లు ఉంటుందని, ఈ సమయంలో సంచార జాతులు, అస్తిత్వం, వారి అభివృద్ధి, సాధికారత నమూనా’ అనే అంశంపై పరిశోధన చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందన్నారు.