మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో (Mallanna sager, kondapochamma reservoirs) ఉత్తర తెలంగాణ సస్యశామలం కానుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.
ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ వల్ల వేలాది ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందించామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఆయన కొండపోచమ్మ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రిజర్వాయర్ లో పూజలు నిర్వహించారు.
రైతులు ఆనందంగా ఉన్నారు:
ఈ రిజర్వాయర్ ద్వారా రాష్ట్రంలోని గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కామారెడ్డి, బాన్సువాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు సాగు నీరు అందిందని పేర్కొన్నారు. సాగు నీరు అందడంతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు పచ్చని పంటలతో సస్యాశామలం అయ్యాయాని ఆనందం వ్యక్తం చేశారు. రైతులంతా ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.
98 శాతం పూర్తి:
జిల్లాలోని మరో జలాశయం మల్లన్న సాగర్ 98 శాతం పూర్తయ్యిందని, రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభిస్తారని ప్రతాప్ రెడ్డి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ జలాలను రాష్ట్రం నలుమూలలా ఇవ్వాలని కేసీఆర్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ మొత్తం ప్రాంతానికి సాగు నీటిని అందించాలనేది కేసీఆర్ సంకల్పమని, అది త్వరలో నెరవేరనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.