సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తారు రోడ్డు నిర్మాణం నిధులు రూ.కోటి తెరాస నాయకులు కాజేశారని భాజపా తప్పుడు ప్రచారం చేస్తుందని అటవీ శాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నిధులు దుర్వినియోగం చేశారనే దానిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భాజపాపై మండిపడ్డారు.
ఇంకా టెండర్లే పూర్తవలేదు..
నియోజకవర్గంలో చెరువా పూర్ నుంచి దుబ్బాక మున్సిపాలిటీ వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరయ్యాయనీ, ఆన్లైన్లో టెండర్లకు ఆహ్వానించారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అది ఇంకా టెండర్ దశలోనే ఉందని, పనులు ప్రారంభం కాకుండా బిల్లులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. టెండర్లో తక్కువ కోడ్ చేసిన గుత్తేదారులకు అగ్రిమెంట్లు, మేజర్ చెక్ పూర్తయిన తర్వాతనే డబ్బులు చెల్లిస్తారని, దీనిపై అవగాహన లేకుండా తెరాసపై భాజపా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.