తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యావరణానికి ప్రాముఖ్యత.. అటవీ కోర్సులకు ఆదరణ - forest college in siddipet district

"ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై అప్రమత్తత పెరిగింది. ప్రజలు పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు ప్రదేశమేదైనా.. పచ్చగా కనువిందు చేసేలా ఆ ప్రాంతాలను తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణను దేశానికి పచ్చతోరణంగా చేయాలనే కంకణంతో సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన హరితహారంతో రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరిగింది. పర్యావరణంపై ప్రజలకు ఆసక్తి పెరగడం వల్ల అటవీ కోర్సులకు మంచి భవిష్యత్​ ఉండనుంది." - అటవీ కళాశాల, పరిశోధన సంస్థ మొదటి స్నాతకోత్సవంలో మంత్రులు హరీశ్, ఇంద్రకరణ్ రెడ్డి

forest courses have bright future
అటవీ కోర్సులకు ఆదరణ

By

Published : Dec 17, 2020, 11:08 AM IST

తెలంగాణలో బీఎస్సీ అటవీ కోర్సును మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసింది. సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థ నుంచి 49 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. విద్యార్థుల కేరింతలు, వారి తల్లిదండ్రుల మధ్య సందడిగా సాగిన స్నాతకోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావుతో పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు.. ప్రతిభ కనబరిచిన వారికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

పర్యావరణకు ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం నిర్దేశించుకుని ఇప్పటివరకు 214 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు. అడవుల సంరక్షణలో నిష్ణాతులను తయారు చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అటవీ కళాశాల, పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు తెలంగాణలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.

వరల్డ్ క్లాస్​ విద్యాసంస్థ

అటవీ కళాశాలకు వస్తే వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలో అడుగు పెట్టిన అనుభూతి కలుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మొదటి బ్యాచ్ విద్యార్థులకు తమకంటూ ఓ ప్రత్యేకత ఉంటుందని.. అదే సమయంలో బాధ్యతలు కూడా ఉంటాయని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖల నియామకాల్లో అటవీ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ప్రాధాన్యతనిచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు. ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లే విద్యార్థులు తిరిగి బోధకులు, ఇతర మార్గాల ద్వారా కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

మంచి పేరు తెస్తాం

అటవీ కోర్సులో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బ్యాచ్​లో పట్టభద్రులవడం గర్వకారణంగా ఉందని విద్యార్థులు అన్నారు. అంతర్జాతీ ప్రమాణాలతో కళాశాల ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో తాము కీలక పాత్ర పోషిస్తామని, కళాశాలకు, తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details