సగటు మనిషి లేచినప్పటి నుంచి పడుకునే వరకు పని ఒత్తిళ్లతో సతమతం అవుతున్నాడు. వీటిని అధిగమించేందుకు కాలంతో పోటీపడి మరి పరిగెత్తాల్సిందే. అవకాశం దొరికినప్పడు వీటన్నింటికీ దూరంగా.. ప్రకృతికి దగ్గరగా వెళ్లి.. ప్రశాంతత పోందాలంటే సగటు పట్టణ జీవికి పగటి కలే. ఇందుకోసం ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లాలి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పట్టణాలకు సమీపంలో అర్బన్ పార్కుల పేరుతో ఆక్సిజన్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేటలో వందల ఎకరాల విస్తీర్ణంలో పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
మూడేళ్లలో హరిత వనంగా మార్చారు
ఆక్సిజన్ పార్కు ఏర్పాటుపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేటకు అతి సమీపంలో సుమారు 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 2017 వరకు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతాన్ని మూడేళ్లలో హరిత వనంగా మార్చారు. మొదట పార్కు చుట్టూ కంచె వేయించారు. అనంతరం లక్షకు పైగా మొక్కలు నాటించారు. కుంటలు, చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి జలవనరులను అభివృద్ధి చేశారు. ఫలితంగా పచ్చదనం, జంతుజాలం పెరిగింది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, నక్కలు, అడవి పందులు వంటి జంతువులు, నెమళ్లు వంటి పక్షుల సంతతి పెరిగింది.