ఓవైపు అధిక వర్షాలు... మరోవైపు దోమపోటు పంటని పీల్చి పిప్పిచేయగా మిగిలిన పంటకు మద్దతు ధర కల్పించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సన్నరకం ధాన్యం వేసి అధిక పెట్టుబడులు పెడితే చివరకు నష్టాలే మిగిలాయని వాపోయారు. చేసేది లేక మనస్తాపంతో ఆరుగాలం శ్రమించిన పంటకు నిప్పు పెట్టాడు ఓ రైతు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లిలో పంటకు నిప్పు పెట్టి... అవే మంటల్లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు.
దిగుబడి రాలేదని...
పెడ్డగుండవెళ్లి గ్రామానికి చెందిన నక్కల బాపురెడ్డి అనే రైతు తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు ఎకరాల సన్న రకం వడ్లను సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మనస్తాపంతో తన పొలాన్ని తగలబెట్టాడు. అదే మంటల్లో దూకి ఆత్మహత్య యత్నానికి సిద్ధపడగా... తోటి రైతులు, కుటుంబసభ్యులు బాపురెడ్డిని అడ్డుకుని ఓదార్చారు.