నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఏర్పడింది. రద్దైన దోమ్మాట, రామాయంపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. రెండు పర్యాయాలు సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డిల మధ్యే ప్రధానంగా పోటీ జరిగింది. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో చెరుకు ముత్యంరెడ్డి విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. దుబ్బాకకు ఇప్పటి వరకు శాసన సభ్యులుగా సేవలందించిన ఇద్దరూ చనిపోవడం గమనార్హం.
బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
2020 ఆగస్టులో అనారోగ్యంతో రామలింగారెడ్డి మృతి చెందడం వల్ల దుబ్బాక నియోజకవర్గాని తొలి ఉపఎన్నిక వచ్చింది. ఉపఎన్నిక బరిలో.. తెరాస నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి, భాజపా నుంచి రఘునందన్ రావు నిలిచారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెరాస తరఫున ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా తరఫున మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఎన్నికల మాంత్రికుడు హరీశ్ రావు వ్యూహాలు
గెలిచితీరాలన్న లక్ష్యంతో ఆయా పార్టీలు ప్రచారంలోకి దిగాయి. ఎన్నికల మాంత్రికుడిగా పేరున్న హరీశ్ రావు.. తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలోని ఒక్కో మండలం బాధ్యతలు అప్పగించారు. వీరికి అదనంగా కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు ఇంఛార్జీలుగా ఉన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో తమ నాయకుల మధ్య ఉన్న విభేదాలు తొలగించి అంతా సమష్టిగా విజయం కోసం పనిచేసేలా చేయడం, ప్రతి గ్రామంలో తెరాసకే ఓట్లలో ఆధిక్యం వచ్చేలా రంగం సిద్ధం చేయడం వంటి పనులు వీరికి అప్పగించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నాయకుణ్ని బాధ్యునిగా నియమించారు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందిన సంక్షేమ ఫలాలు, ప్రయోజనాలు గుర్తు చేయడం.. ప్రభుత్వం పట్ల వారికి ఎమైనా అసంతృప్తి ఉంటే దాన్ని తొలగించి.. వారు కారు గుర్తుకే ఓటు వేసేలా చేయడం వంటి బాధ్యతలు వీరికి అప్పగించారు.