ఉపఎన్నికల ప్రచారంతో పాటు తెరాసలోకి చేరికలు జోరందుకున్నాయి. దుబ్బాక స్థానిక కాంగ్రెస్ నేతలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది శూన్యమని మంత్రి ఆరోపించారు. దుబ్బాకలో పోలింగ్ పూర్తయ్యే వరకు ఉంటానంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్‌రావు చురకలంటించారు. ఎన్నికలయ్యాక కాంగ్రెస్ నేతలు కనిపించరంటూ ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ, ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని హరీశ్‌రావు నిలదీశారు.
ఆయన ఆశయ సాధన కోసమే..
తెరాస అభ్యర్థి సుజాత ప్రచారంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. రాయపోల్ మండలం ఆరేపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నమాసాన్‌పల్లి గ్రామాల్లో పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. రామలింగారెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకే పోటీలో ఉండాల్సి వచ్చిందని సుజాత తెలిపారు.