సిద్దిపేటలో నిర్మించి న రెండు పడగ గదుల ఇళ్ల సముదాయంలోకి కొత్తగా వచ్చిన వారు.. ఇది పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీ అంటే ఆశ్యర్యపోక తప్పదు. పెద్ద పెద్ద నగరాల్లో నిర్మించే గేటేడ్ కమ్యూనిటీలకు ఏమాత్రం తీసిపోని.. ఆ మాటకు వస్తే అంత కంటే ఎక్కువ సౌకర్యాలతో నిర్మించారు. పక్కా ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో దేశంలో మరేక్కడ లేని విధంగా ఇల్లు లేని పేదల కోసం కాలనీ నిర్మించారు.. అదే కేసీఆర్ నగర్.
163కోట్ల రూపాయలతో 35ఎకరాల విస్తీర్ణంలో
కేసీఆర్ నగర్‌ను 163కోట్ల రూపాయలతో 35ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. జీ+2 తరహాలో 205 బ్లాకులుగా నిర్మించారు. ప్రతి బ్లాకులో 12 చొప్పున మొత్తం 2460 రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి గాలి, వెలుతురు నిరాటంకంగా ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఇల్లు కూడా 560 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక హలు, వంట గది, రెండు పడక గదులు, బాల్కనీ, భారతీయ శైలిలో ఒకటి, పాశ్చాత్య శైలిలో మరోకటి ఇలా రెండు శౌచాలయాలు ప్రతి ఇంటికి ఏర్పాటు చేశారు. కాలనీ మొత్తం ప్రతి బ్లాకును అనుసంధానించేలా విశాలంగా సీసీ రోడ్లు వేశారు. ప్రధాన రహదారులను మరింత విశాలంగా వేసి.. మధ్యలో డివైడర్లు సైతం ఏర్పాటు చేశారు. ముందస్తు ఆలోచనతో నిర్మాణం ప్రారంభంలోనే మూడు సంవత్సరాల క్రితం రోడ్డు పక్కల నాటిని మొక్కలు చెట్లుగా ఎదిగి.. పచ్చదనాన్ని పంచుతున్నాయి. వర్షం నీరు వృథా కాకుండా ప్రతి బ్లాకుకు ఓ ఇంకుడు గుంతను నిర్మించారు. అంగన్ వాడీ కేంద్రం, పాఠశాలకు స్థలం వంటి కనీస అవసరాలే కాదు.. అత్యాధునీక సదుపాయలు ఈ కేసీఆర్ నగర్ సొంతం.
24 గంటలు నిరంతరాయంగా నీటి సరఫరా
ఖరీదైన గేటేడ్ కమ్యూనీటిల్లో సైతం లేని విధంగా ఇక్కడ పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ఇందు కోసం ప్రతి ఇంటికి ప్రత్యేకంగా మీటర్ సైతం ఏర్పాటు చేశారు. రెండు నెలలకు ఒకసారి.. వినియోగదారులు వాడకాన్ని బట్టి రుసుం వసూలు చేయనున్నారు. పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయడంతో సిలిండర్ కంటే 25శాతం తక్కువ ధరకే గ్యాస్ లభించనుంది. ప్రతి ఇంటికి 24 గంటలు నిరంతరాయంగా నీటి సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 6లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు ట్యాంకులు సైతం నిర్మించారు. రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు అంత రాయం ఏర్పడినా.. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా.. రెండు రోజులకు సరిపోయే సామర్థ్యంతో సంపును ఏర్పాటు చేశారు. వృథాను ఆరికట్టేందుకు ప్రతి ఇంటికి నీటి మీటరును బిగించారు. కాలనీ వాసులకు ఆహ్లాదం పంచేలా నాలుగు చోట్ల పార్కులు, నిత్యవసరాల కోసం బయటికి వెళ్లకుండా ఇంటిగ్రెటేడ్ మార్కెట్, 5మినీ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేశారు. 4000 మంది సామర్థ్యంతో ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ సైతం నిర్మించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. వైద్య అవసరాల కోసం ఓ బస్తీ దవాఖాన సైతం మంజూరు చేశారు. భవిష్యత్ అవసరాలం కోసం మరో పది ఎకరాల స్థలాన్ని రిజర్వ్ లో ఉంచారు.