తెలంగాణ

telangana

ETV Bharat / state

Gouravellli reservoir: గౌరవెల్లి పరిహారం చెల్లింపునకు ఎందుకింత ఆలస్యం..? - గౌరవెల్లి జలాశయం

Gouravellli reservoir: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి జలాశయం ముంపు బాధితులు చేపట్టిన ఆందోళనల వెనక పరిహారం పంపిణీ సమస్య కీలకంగా మారింది. 2011లో భూసేకరణ ప్రకటన వెలువడినప్పుడు నిర్ణయించిన ప్యాకేజీని అధికారులు అమలు చేస్తున్నారు. ప్యాకేజీ అమలు జాప్యం కావడంతో మేజర్లయిన వారికి'పరిహారం అందించాలని బాధితులు డిమాండ్ చేస్తుండటం పరిస్థితిని సంక్లిష్టంగా మారుస్తోంది.

Gouravellli reservoir
Gouravellli reservoir

By

Published : Jun 15, 2022, 3:05 PM IST

Gouravellli reservoir: ఉమ్మడి రాష్ట్రంలో 2007లో 1.43 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2015లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర సర్కారు పునరాకృతితో దీని సామర్ధ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచడంతో ముంపు ప్రాంతం పెరిగింది. గతంలో ఒక్క గుడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపులోఉండగా ఆ సంఖ్య అనుబంధ గ్రామాలతో కలిపి 8కి చేరింది. గుడాటిపల్లి, తెనుగుపల్లి, మదెల్లపల్లి, సోమాజితండా, చింతల్‌తండా, పొత్తపల్లి, జాలుబాయితండా, తిరుమల్‌తండాలు ముంపునకు గురవుతున్నాయి. మొత్తం 3,800 ఎకరాల సేకరణ లక్ష్యం కాగా 84 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో పునరావాస ప్యాకేజీకి సంబంధించిన పరిహారాలన్నీ 2013లోనే అందించామని... కొందరికి ఎకరాకు 2.10 లక్షలు, మరికొందరికి ఎకరాకు 6.90 లక్షల చొప్పున పలు దఫాలుగా పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. ఐతే అధికారులతో వాదనను నిర్వాసితులు అంగీకరించడం లేదు.

అన్ని కుటుంబాలకు పరిహారం అందలేదని సామాజిక సర్వేలో చాలా మంది తప్పిపోయారని స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి...ఆ తర్వాత మేజర్లయిన వారినీ కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికి 8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఆ క్రమంలోనే గుడాటిపల్లి సహా ఇతర గ్రామాల్లో నిర్వాసితులు ఏళ్లుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో మేజర్లుగా మారిన యువతకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చేలా ప్రభుత్వం గతంలో జీవో జారీచేసింది. ఐతే ఆ మేరకు పరిహారం తీసుకునేందుకు ఆయా గ్రామాల్లో ఎవరూ ముందుకురాలేదు. గతేడాది ప్రాజెక్టు పనుల్లో వేగంపెరగడంతో డిసెంబర్‌ నుంచి నిర్వాసితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల గౌరవెల్లి జలాశయం కట్టపై ఉన్న దారులను మూసివేయడం పంపుహౌస్‌లో మోటార్లను బిగిస్తుండటం ఈ నెల 12వ తేదీన ట్రయల్స్​ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో ఆందోళనలు ఉద్ధృతం చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్‌ ముంపులో మొత్తం 937 కుటుంబాలు ఆవాసాన్ని, భూములను కోల్పోతున్నాయి. ఇందులో ఇంకా 186 కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details