తెలంగాణ

telangana

ETV Bharat / state

Crop Damage: నట్టేట ముంచుతున్న వర్షాలు.. రైతు కష్టమంతా నీటిపాలు - రైతుల కష్టాలు

Crop damage in Medak : రాష్ట్రంలో కొనసాగుతున్న అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన పంటను అన్నదాతల కళ్లముందే వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వడగళ్లతో చేలలోనే ఉన్న పంట నష్టపోగా ఇప్పుడు మరోసారి కురిసిన వర్షాలతో కల్లాల్లో ఉన్న ధాన్యమంతా నీటిలో కొట్టుకుపోయింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 29, 2023, 1:34 PM IST

నట్టేట ముంచుతున్న వర్షాలు.. రైతు కష్టమంతా నీటిపాలు

Crop damage in Medak : అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని అరబెడుతుండగా.. ఆరేలోపే మళ్లీ వర్షం పడుతోంది. మెదక్ జిల్లాలోని కొల్చారం, శివంపేట, మనోహరాబాద్, వెల్దుర్తి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. కొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది.

Crop damage in Siddipet : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో లక్షా 98 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 4 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందుకు 420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. కనీసం 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైస్ మిల్లుల్లో హమాలీల కొరత కారణంగా ధాన్యం తూకం వేయడం లేదని రైతులు వాపోతున్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Paddy Damage in Siddipet : : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌, కోహెడ మండలాల్లో ఉదయం కురిసిన భారీ వర్షానికి వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులో వరద నీరు రాశుల కిందికి చేరి ధాన్యం కొట్టుకుపోయింది. కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆరుగాలం శ్రమించిన పంట చేతికందిన తరుణంలో కళ్ల ముందే నష్టపోవటం అన్నదాతలకు తీరని మనోవేదనను మిగులుస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు పడే సూచనలుండటంతో మిగిలిన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో అని ఆవేదన చెందుతున్నారు.

"వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ధాన్యం తడిసిపోయాయి. మేము పండించిన సగం పంట పొలంలోనే ఉండిపోయింది. మిషన్​లతో కోత కోసినా.. వడ్లు రావట్లేదు. వచ్చిన కాస్త ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు. వర్షానికి మిగిలిన సగం నీటి పాలవుతున్నాయి. ఎండ పెడదాం అంటే స్థలం లేదు. ఎంతో కష్టపడి, అప్పులు చేసి పంట పండిస్తే చివరికి మిగిలేది ఏమి లేదు.. కన్నీరు తప్ప. ఇలా అయితే ఏ రైతు పండించాలని అనుకోరు. ప్రభుత్వం ఎలాగైనా పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నాం."- స్థానిక రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details