కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ సీపీఐ ఆధ్వర్యంలో పల్లెపల్లెకు-గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కూచనపల్లి గ్రామ శివారులో 15 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు వెంటనే రెండు పడక గదుల ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
సీఎం ఎవరైనా.. ప్రజాస్వామ్యబద్ధ పాలన చేయాలి : చాడ - chada venkat reddy fires on kcr government
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలతో రైతులు రోడ్డుపాలవుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెపల్లెకు-గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న రైతులు చేస్తున్న ట్రాక్టర్ల ర్యాలీకి సీపీఐ సంపూర్ణ మద్దతిస్తుందని చాడ స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎటువైపు ఉన్నారని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ప్రజల నుంచి దూరమవుతున్నామనే భావనతో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. మంత్రులు, ఎమ్మెల్యేలలో అంతర్మథనం మొదలైందని చాడ అన్నారు. ఎవరు సీఎంగా ఉన్నా.. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కోరారు.