సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కరోనా అనుమానితులకు తిప్పలు తప్పడం లేదు. ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా కిట్ల కొరత కారణంగా పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ లక్షణాలు ఉన్న వారు మాత్రం అపరిమిత సంఖ్యలో వస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా ఉదయం 4 గంటలకే ఆస్పత్రికి చేరుకొని క్యూలో చెప్పులు పెట్టినా తమ వంతు రావడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లక్షణాలతో ఆయాసపడుతూ ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల కింద కూర్చొని గోడును వెళ్లబోసుకున్నారు.
తగ్గుతున్న కరోనా పరీక్షలు.. పెరుగుతున్న అనుమానితులు.! - corona kits shortage in husnabad hospital
కరోనా అనుమానితులకు పరీక్షల కోసం తిప్పలు తప్పడం లేదు. రోజుల తరబడి ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా తమ వంతు రాక నిరాశతో వెనుదిరుగుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి పైగా కరోనా అనుమానితులు ఉంటే.. పరీక్షలు మాత్రం 60కే పరిమతమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
టెస్టుల విషయమై ఆస్పత్రి వైద్యాధికారి మురళీకృష్ణను వివరణ కోరగా ఉన్నతాధికారుల సూచనల మేరకే పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రికి ప్రతిరోజు టెస్టుల కోసం దాదాపు 200 మందికి పైగా వస్తుండగా.. పరీక్షలు మాత్రం 50 నుంచి 60 వరకే జరుగుతున్నాయి. మరోవైపు కరోనా టీకా రెండో డోసు తీసుకోవడానికి వచ్చినవారు కూడా గంటల తరబడి తమ వంతు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అనుమానితులు, అటు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారితో ఆస్పత్రిలో రద్దీ పెరగడంతో కరోనా లేని వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:కింగ్‌కోఠి ఘటన.. సీఎంపై చర్యలకు హెచ్ఆర్సీలో ఫిర్యాదు