సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చేయాలని డిమాండ్ చేస్తూ గులాబీ పూలతో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. రహదారిపై ఉన్న గుంతల్లో గులాబీ మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా... రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చి వేయించలేని స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
గుంతలను పూడ్చేయాలని గులాబీ మొక్కలు నాటి నిరసన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రధాన రహదారుల్లో ఏర్పడిన ప్రమాదకర గుంతలను పూడ్చేయాలని కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేశారు. రహదారిపై ఉన్న గుంతల్లో గులాబీ మొక్కలు నాటి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వల్ల ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నాలుగు నెలల క్రితం రహదారి గుంతలపై గులాబీ జెండాలతో కంచె ఏర్పాటు చేసి నిరసన తెలిపితే తాత్కాలికంగా మట్టిపోసి అధికారులు చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ మండిపడ్డారు. గుంతల్లో పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలిపారు. శాశ్వత పరిష్కారం చూపకపోతే రానున్న రోజుల్లో రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.